ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో గల అరబిందో ఫార్మా (ఎపిటోరియా) పరిశ్రమలో శనివారం సాయంత్రం ప్రొడక్షన్ బ్లాక్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి చెందాడు. నాలుగు గంటల సమయంలో ప్రొడక్షన్ బ్లాక్ 1లో విద్యుత్ ప్యానెల్ బోర్డు రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో దశరథ్ ప్రొఫెషనల్స్ సర్వీసెస్ కాంట్రాక్టులో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్న పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి బాలకృష్ణ (27) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. యాజమాన్యం వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సైతం చూపించకుండా పోలీసులను పెట్టి విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం మార్చురీలో పెట్టేశారు. విషయం తెలుసుకున్న సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్‌వి రమణ, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, నాయకులు రెడ్డి శంకర్రావు, బి.సూర్యనారాయణ ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి 50. లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయుకులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు నిరసన వ్యక్తం చేసారు. కార్మికుడి తల్లిని, కుటుంబ సభ్యులను నాయకులు ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరబిందో యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలనే తరుచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నారని అన్నారు. గతంలో పలు ప్రమాదాలలో కార్మికులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసారు. అరబిందో యాజమాన్యానికి లాభాలు తప్ప కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.