- సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాక
- పోస్టర్‌ను ఆవిష్కరించిన నాయకులు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : 'చలో స్టీల్‌ప్లాంట్' పేరిట అక్టోబర్ 5న విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ సమీపంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద తలపెట్టిన ఉక్కు రక్షణ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉక్కు రక్షణ బైకు యాత్ర ముగింపు సందర్భంగా ఆ రోజు ఈ బహిరంగ సభ జరగనుందని చెప్పారు. ముఖ్యవక్తగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానున్నట్టు తెలిపారు. శుక్రవారం విశాఖలోని నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహిరంగ సభ పోస్టర్‌ను నర్సింగరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెస్తామని ఇటీవల ప్రకటించారని, అందులో వాస్తవమెంతని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముంచుతున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని ఉక్కు శాఖ మంత్రితో పార్లమెంట్లో ప్రకటింపజేసే ధైర్యం జివిఎల్‌కు ఉందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలహీన పరిచేందుకు మోడీ సర్కారు చేస్తోన్న ప్రయత్నాలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఉక్కు రక్షణ బైకు యాత్ర
ములగాడ, మాధవధార (విశాఖ) : ఈ నెల 20 నుంచి సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్రలో సాగుతున్న ఉక్కు రక్షణ బైకు యాత్ర శుక్రవారానికి పదో రోజుకు చేరుకుంది. ఈ యాత్ర మల్కాపురం, కంచరపాలెం జోన్లలోని పలు వార్డుల్లో పర్యటించింది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం రేకెత్తించింది. ఆయా చోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌తోనే పారిశ్రామిక ప్రాంత ప్రజల మనుగడ సాధ్యమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వల్లే విశాఖ నేడు ఇంతలా అభివృద్ధి చెందిందని వివరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోడీ సర్కారు అమ్మకానికి పెడితే... వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు చిత్తశుద్ధితో వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రజల సంపదైన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించడం దారుణమన్నారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో నాయకులు బి.జగన్, పైడిరాజు, ఆర్.లక్ష్మణమూర్తి, బి.పద్మ, బి.ఈశ్వరమ్మ, అప్పారావు, కూన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.