Oct 21,2023 11:37
  • కార్మిక పోరాటాలు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతోనే.. 

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా నాగర్‌నార్‌లోని స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలనుకున్న బిజెపి సర్కారు విధానాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, కార్మికులు నిరంతర పోరాటాలతో వెనక్కి కొట్టగలిగారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్‌, జెఎంఎం కూడా స్టీల్‌ పోరాటానికి మద్దతుగా నిలవడంతో కేంద్రంలోని మోడీ సర్కారు వెనక్కి తగ్గక తప్పలేదు. మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం విషయానికొస్తే... కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తామని 2021 జనవరి 27న ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి నుంచి 981 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఉత్తరాంధ్ర ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడుతోంది. ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. కేవలం రెండు వేల మంది కార్మికులతో ఏటా మూడు లక్షల మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తితో నాగర్‌నార్‌ ప్లాంట్‌ నడుస్తోంది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ వేల మంది కార్మికులతో ఏటా 75 లక్షల మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమగా ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది. గడిచిన రెండేళ్లుగా రైలు ర్యాకులు ఇవ్వకుండా, బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని మూసేసి కేంద్రంలోని మోడీ సర్కారు ఈ కర్మాగారాన్ని నిర్వీర్యం చేస్తోంది.
 

                                            నాగర్‌నార్‌ స్టీల్‌ ప్రయివేటీకరణపై వెనక్కి తగ్గడానికి కారణమేంటంటే..

కేంద్ర ప్రభుత్వ రంగంలోని గనుల సంస్థ ఎన్‌ఎండిసి ఆధ్వర్యాన నాణ్యమైన ఇనుప గనులు, ఖనిజం బైలదిల్లాలో వెలికితీయబడుతున్నాయి. ప్రపంచంలోనే నాణ్యమైన గనులకు బైలదిల్లా ప్రసిద్ధి. గనులు, నిధులు ఉండడంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా నాగర్‌నార్‌లో స్టీల్‌ప్లాంట్‌ను ఎన్‌ఎండిసి ఏర్పాటు చేసింది. గతంలో దీన్ని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌, జెఎంఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్లాంట్‌ సమర్థవంతంగా నడవడం లేదంటూ మోడీ సర్కారు ప్రయివేట్‌ వాళ్లకు అప్పగించే క్రమానికి బాటలు వేసింది. వేల్యూయేషన్‌ చేయించింది. ఇఒఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌) కోరింది. బిడ్డింగ్‌లో జిందాల్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఆ సంస్థకు నాగర్‌నార్‌ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజా, కార్మిక పోరాటాలు బస్తర్‌ జిల్లా అంతటా సాగాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్‌ వచ్చినప్పుడు ప్రజలు, కార్మికులు నిరసన తెలపడంతో ప్రయివేటీకరణ చేయడం లేదని ప్రకటించారు. అయినా, కార్మికులు, ప్రజలకు నమ్మకం కుదరలేదు. రాజకీయ పార్టీల మద్దతుతో పోరాటం ఊపందుకుంటున్న ప్రస్తుత స్థితిలో తాజాగా ఈ నెల 19న అమిత్‌ షా బస్తర్‌ జిల్లా వచ్చి 'ఈ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయబోం, ప్రపంచ గనుల మ్యాప్‌లో బస్తర్‌ జిల్లా పేరుండాలి' అని ప్రకటించారు. నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనుండడంతో బిజెపి అగ్రనేతలిద్దరూ ఈ ప్రకటన చేశారనే చర్చ ఆ రాష్ట్రంలో సాగుతోంది.
 

                                                 పోరాటాల వల్లే అక్కడ ఆగింది.. విశాఖలోనూ తొలి నుంచీ అడ్డుకుంటున్నాం

ఛత్తీష్‌గఢ్‌లోని నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి బిడ్డింగ్‌ అయిపోయాక 'సీను రివర్స్‌' అయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో తొలి నుంచీ కార్మికులు, ప్రజానీకం కేంద్ర ప్రయివేటీకరణ చర్యలను అడ్డుకుంటూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక పోరాటానికి మద్దతివ్వడంతో ప్రయివేటీకరణకు అడ్డుకట్టపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. పోరాట కమిటీ గట్టిగానే ప్రయివేటీకరణను అడ్డుకుంటోంది. నాగర్‌నార్‌ ప్రయివేటీకరణ పోరాటాలతోనే ఆగింది. ప్రభుత్వమే బంద్‌కు పిలుపు ఇవ్వడం వంటి చర్యలు కలిసొచ్చిన అంశాలు.
-సిహెచ్‌.నర్సింగరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌