Oct 01,2023 21:22

- కంటైనర్‌, కారు, 8 సెల్‌ ఫోన్లు, స్వాధీనం
- తొమ్మిది మంది అరెస్టు, నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు
ప్రజాశక్తి -సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో 129 కిలోల గంజాయిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉన్నారు. సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లు ముందుస్తు సమాచారం మేరకు పోలీసులు వాహన తనికీలు చేపట్టారు. దీనిలో భాగంగా సీలేరు వద్ద అనుమానంతో కంటైనర్‌లో సోదాలు చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కంటైనర్‌ వాహనం, కారు, ఎనిమిది సెల్‌ ఫోన్లు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్ర -ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తున్నారని విచారణలో వెల్లడైనట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన వారిలో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచయ్యపాలేనికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి బనవత్‌ భాను ప్రకాష్‌, చెన్నైకి చెందిన జె.ఆంటోని, అల్లూరి సీతారామరాజు జిల్లా జికె.వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ చౌడుపల్లి గ్రామానికి చెందిన పాంగి సంతోష్‌, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికికి ఇంజనీరింగ్‌ విద్యార్థి బుడితి హంసరాజు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన బి.లోకేష్‌, తమిళనాడుకు చెందిన ఎ.సంగయ్య, ఆర్‌.కుమార్‌వల్లి, ఎ.మణికంఠ ప్రభు, ఆకాష్‌, ఎస్‌.నజీర్‌ ఉన్నారు.