ప్రజాశక్తి - సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రహస్యంగా ఓ వాహనంలో తరలిస్తున్న 950 కిలోల గంజాయిని ఒడిశా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. చిత్రకొండ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ బొలెరో వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా దానిలో ఉన్నవారు అతివేగంతో వెళ్లిపోయారు. పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. చిత్రకొండ పోలీసులు వ్యాన్‌ను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టబడ్డ గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన ఈ గంజాయిని ఆంధ్రాలోకి తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.