Sep 08,2023 08:25

న్యూఢిల్లీ : సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1 విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భానుడి దిశగా పయనిస్తోన్న ఆదిత్య ఓసారి పుడమిని చూసి మురిసి పోయింది. ఈ సమయంలోనే తొంగి చూస్తున్నట్లు చందమామ కూడా కనిపించింది. ఆ దృశ్యాన్ని క్లిక్‌ మనిపించి పనిలో పనిగా నేను క్షేమమే అన్నట్లు ఓ సెల్ఫీ కూడా తీసుకుని ఇస్రోకు పంపింది. ఆ అద్భుత దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేసింది. ఈ నెల 4న ఆదిత్య ఎల్‌-1లోని కెమెరా ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో వివరించింది. ఈ చిత్రంలో ఆదిత్య ఎల్‌-1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌, సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ కనిపించాయి. దీంతోపాటు భూమి, చంద్రుడు ఒకేసారి కనిపించిన దృశ్యాలను కూడా ఆదిత్య క్లిక్‌మనిపించింది. ఈ వీడియోను ఇస్రో సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. 'భూమి-సూర్యుడి మధ్యలోని లగ్రాంజ్‌ పాయింట్‌కు ప్రయాణంలో ఆదిత్య ఎల్‌-1 వీక్షించిన దృశ్యాలివి' అని ఇస్రో రాసుకొచ్చింది. ఆదిత్య ఎల్‌-1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌.. సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయనుంది. ఇక స్యూట్‌ ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ను పరిశీలించనుంది. ఈ నెల 2న ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ విన్యాసంతో ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం 282 కిలోమీటర్ల శ 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని ఈ నెల 10న చేపట్టనున్నారు. ఆదిత్య ఎల్‌-1 నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న 'ఎల్‌-1' (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ చేరుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో ఏడు రకాల పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమోస్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.